శ్రీ శార్వరినామ సంవత్సర నవ నాయక ఫలితాలు

శ్రీ శార్వరినామ సంవత్సర నవ నాయక ఫలితాలు

 

శ్రీ శార్వరినామ సంవత్సర నవ నాయక ఫలితాలు

(మార్చ్ 25 2020 – ఏప్రిల్ 12 2021)

 

 

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో  కూడినదే పంచాంగం. తిథులు శ్రేయస్సుకు, వారాలు ఆయుర్వృద్ధికి, నక్షత్రాలు పాప పరిహారానికి, యోగాలు రోగ నివారణకు, కరణాలు  కార్యసిద్ధికి తోడ్పడతాయి. ఈ పంచాంగ శ్రవణం వింటే శుభం కలుగుతుంది. శత్రు, రుణ బాధలు, చెడు ఫలితాలు తొలగుతాయని నమ్మకం.

 

పాడ్యమి నుంచి పౌర్ణమి/ అమావాస్య వరకు గల వాటిని తిథులని, ఆదివారం నుంచి శనివారం వరకు గల వాటిని వారాలని, అశ్వని నుంచి రేవతి వరకు గల వాటిని నక్షత్రాలని, విష్కంభము నుంచి నైధృతి వరకు గల వాటిని యోగములు, బవ నుంచి కింస్తుఘ్నం వరకు పదకొండింటినీ కరణములుగా పిలుస్తారు. 27 నక్షత్రాలకు 27 యోగాలు వరుస క్రమమున వస్తాయి. ఇక తిథుల ఆధారంగా కరణములు ఏర్పడతాయి.

చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీ శార్వరి నామ సంవత్సరంగా పిలుస్తారు. బార్హస్పత్యమానం ప్రకారం పరీధావినామ సంవత్సరమని, గురుదయాబ్ధముచే శ్రావణాబ్ధమని పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 34వది శ్రీ శార్వరి నామ సంవత్సరం. ఈ సంవత్సరం ధాన్యదానం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.

మకర సంక్రాంతి

 శ్రీశార్వరి నామ సంవత్సర పుష్య శుద్ధ విదియా గురువారం అనగా 14–1–2021వ తేదీ ప.గం.1.58 ని.లకు ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదం మకర రాశిలో రవి(సూర్యుడు) ప్రవేశం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.

మూఢములు

శుక్రమూఢమి....29.05.20 శుక్రవారంతో ప్రారంభమయ్యే శుక్రమూఢమి 08.06.2020వ తేదీ సోమవారంతో ముగుస్తుంది. తిరిగి 17.02.21వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమై 30.04.21వ తేదీ శుక్రవారంతో ముగుస్తుంది.

గురు మూఢమి: 16–01–2021వ తేదీ శనివారంతో ప్రారంభమైన ఈ మూఢమి 10–02–2021వ తేదీ బుధవారంతో ముగుస్తుంది.

(ఈ కాలాల్లో సాధారణ కార్యక్రమాలు మినహా వివాహాది శుభ ముహూర్తాలు ఉండవు.)

పుష్కర నిర్ణయం

శ్రీ శార్వరినామ సంవత్సరం, కార్తీక శుద్ధ షష్ఠి శుక్రవారం అనగా 20.11.20  మధ్యాహ్నం 1.22గంటలకు దేవగురుడు బృహస్పతి మకరరాశిలో ప్రవేశించడంతో తుంగభద్ర నదీ పుష్కరాలు ప్రారంభమై 01.12.20వ తేదీతో ముగుస్తాయి.

 

ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయం, కర్ణాటకలోని హంపీ, విజయనగరాలలో ఈ నది ప్రవహిస్తుంది. ఈ 12రోజులు నదీస్నానాలుదానధర్మాలు విశేష ఫలితాలు ఇస్తాయి.

 

అధిక మాసం

మేషం మొదలుకొని సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సంచరిస్తాడు. ఇలా సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని  మేష సంక్రమణం, వృషభ సంక్రమణం...అని అంటారు. ఇలా సూర్య సంక్రమణం జరగని మాసాన్ని అధికమాసం అని అంటారు.  ఈ ఏడాది ఆశ్వయుజ మాసం అధికమాసమైంది. అధిక మాసంలో శుభముహూర్తాలు ఉండవు, నిజ ఆశ్వయుజ మాసంలోనే శుభముహూర్తాలు ఉంటాయి. సెప్టెంబర్ 18 నుంచి అధిక ఆశ్వయుజ మాసం ప్రారంభమై అక్టోబర్ 16 తో ముగుస్తుంది. 17వ తేదీ నుంచి నిజ ఆశ్వయుజ మాసం ప్రారంభం.

గ్రహణాలు..ఈ సంవత్సరం అనగా జూన్ 21వ తేదీ(2020) జ్యేష్ఠ అమావాస్య ఆదివారం ఉదయం 10.24 గంటలకు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై ప.1.55 గంటలకు ముగుస్తుంది. ఇది మృగశిర, ఆరుద్ర నక్షత్రాలలో సంభవిస్తున్నందున ఈ నక్షత్రాలతో పాటు, మిథునరాశి వారు చూడరాదు.

శ్రీ శార్వరినామ సంవత్సర ఫలితాలు

 

ఈ ఏడాది వర్ష లగ్నం కర్కాటకం, అధిపతి చంద్రుడు,

జగల్లగ్నం వృశ్చికం అయినది. అధిపతి కుజుడు.

ఈ సంవత్సరానికి  రాజు బుధుడు  కాగా, మంత్రి, ఆర్ఘాధిపతి, సేనాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, పూర్వసస్యాధిపతి గురుడు, అపర  సస్యాధిపతి బుధుడురసాధిపతి శని, నీరసాధిపతి గురుడు.

ఇక నవనాయకుల్లో ఐదుగురు శుభులు కాగా, నలుగురు పాపులు.

ఈ సంవత్సరానికి రాజు బుధుడు, మంత్రి చంద్రుడు  శుభులైనందున అనుకూలత ఎక్కువగా ఉంటుంది.

 రాజకీయ వైషమ్యాలు, నాయకుల మధ్య నిలకడ లోపించి పాలన కొంత అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది.

అలాగే, ప్రజా సమస్యలు పెరుగుతాయి.

అధికారంలో ఉన్నవారు ఒత్తిడులు ఎదుర్కొంటారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.

అలాగే, బ్యాంకింగ్‌ రంగం మరింత పురోగమిస్తుంది.

రక్షణ రంగం ప్రాధాన్యత పెరుగుతుంది.

రైతాంగం కోసం ప్రభుత్వాలు కొత్త పథకాలు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి పాటుపడే అవకాశం ఉంది. 

స్టాక్‌ మార్కెట్‌ రంగం,  కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కొన్ని సందర్భాల్లో  రికార్డులు సృష్టిస్తుంది.

పర్యాటక రంగం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

సినీ, నాటక రంగాలు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిలదొక్కుకుంటాయి.

కొన్ని ప్రాంతాల్లో  వర్షాలు సమృద్ధిగానే కురిసి పంటలు విశేషంగా పండుతాయి.

ముఖ్యంగా అపరాల పంటలు(పప్పు ధాన్యాలు) అధికంగా ఉంటాయి.

అలాగే, వీటిని పండించే రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

నల్లటి భూములు విశేషంగా పండుతాయి.

అలాగే, గోధుమలు, సెనగలు, పెసలు, ఉలవ పంటలు విస్తారంగా పండుతాయి. 

అయితే దేశ మధ్యప్రాంతంలో ప్రజల మధ్య కలహాలు, ఇరుగు పొరుగు దేశాలతో వివాదాలు, వదంతుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నా, ప్రభుత్వాలు సమర్థవంతమైన పాలనతో వీటిని అధిగమిస్తాయి.

దేశ రాజకీయాల్లో అశ్చర్యకరమైన పరిస్థితులు నెలకొంటాయి.

కొందరు వృద్ధ నాయకులు, కళాకారులకు గడ్డు స్థితిగా ఉంటుంది.

వాహన, రోడ్డు ప్రమాదాలు, భూకంపాది భయాలు కొంత కలవరపాటు కలిగించే వీలుంది.

విచిత్రమైన వ్యాధులు కూడా వ్యాప్తి చెంది ప్రజలను భయపెట్టవచ్చు.

ఇక నిత్యావసరాల ధరలు అదుపులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

బంగారం, వెండి, రాగి తదితర లోహాలు, సిమెంట్‌రలలో పెరుగుదల కనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలలో విశేష అభివృద్ధి కనిపిస్తుంది.

6 జూన్ 2020 తేదీ ఆషాఢశుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం గం.7.21లకు రవి ఆరుద్రా నక్షత్రంలో వ్రవేశిస్తున్నందున సస్యాభివృద్ధి, అగ్నిభయాలు, నాయకుల మధ్య కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి.

పశుపాలకుడు బలరాముడు కావడం వల్ల పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.

అలాగే, సంరక్షకుడు శ్రీకృష్ణుడు కావడం వల్ల విశేష పాడి సమృద్ధి. అయితే, గోవులను మేతకు తీసుకువెళ్లే వాడు యముడు కావడం వల్ల పాడి పంటలకు కొంత నష్టం జరిగే వీలుంటుంది.

సంవత్సరాది నుంచి 2021 జనవరి వరకు వర్షకుంచము బాల్యవయస్సు కలిగిన గోపబాలుని చేతియందు, తదుపరి సంవత్సరాంతం వరకూ యవ్వన గోపబాలుని చేతిలో ఉంటుంది. దీనివల్ల పాడిపంటలు విశేషమని చెప్పవచ్చు. అలాగే, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. 

 

నవనాయక ఫలాలు

 

రాజు బుధుడు- కావడం వల్ల అపరాల సాగు విశేషంగా ఉంటుంది. శిల్ప కళాకారులు, రచయితలకు మంచి గుర్తింపు. రాజకీయ ఒడిదుడుకులు. వ్యాపారులకు విశేష లాభాలు.

మంత్రి చంద్రుడు- ప్రజలు సుభిక్షంగా జీవిస్తారు. తెల్లటి వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు విస్తృతమవుతాయి.

ఆర్ఘాధిపతి చంద్రుడు- వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. తేనె, రసాలు, ఉప్పు, మణులు, ముత్యాలు,గోధుమలు, పంచదార ధరలు తగ్గి, వెన్న, నెయ్యి, పెరుగు, నూనెలు, బియ్యం బంగారం, వెండి ధరలు పెరుగుతాయి.

పూర్వసస్యాధిపతి గురుడు- పచ్చని భూములు బాగుగా పండుతాయి. అలాగే, పచ్చని ధాన్యం, బియ్యం, గోధుమలు, ఇత్తడి, పత్తి, తెల్లని ధాన్యాల ధరలు పెరుగుతాయి.

సేనాధిపతి చంద్రుడు- ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, బియ్యం, గోధుమల ధరలు హెచ్చుగా ఉంటాయి. మంచి వర్షాలు కురుస్తాయి. పాడి ఉత్పత్తులు పెరుగుతాయి.

రసాధిపతి శని- నువ్వులు, మినుములు, ఉలవల పంటలు బాగా పండుతాయి. అలాగే, నల్లటి భూములు విశేషంగా పండుతాయి. రస సంబంధిత వస్తువుల ధరలు తగ్గుతాయి.

నీరసాధిపతి గురుడు- నవరత్నాలు, బంగారం, వెండి, ధాన్యం, సుగంధ వస్తువుల ధరలలో పెరుగుదల ఉన్నా అదుపులో ఉంటాయి.

ధాన్యాధిపతి బుధుడు- అపరసస్యాధిపతి బుధుడు కావడం వల్ల సస్య(పంటలు) వృద్ధి. మధ్యమ వర్షసూచన. జనుల్లో భయాందోళనలు కలుగుతాయి. తుపాను గాలులు బీభత్సం సృష్టించే వీలుంది.

మేఘాధిపతి చంద్రుడు- వివిధ ప్రాంతాల్లో సరిపడు వర్షాలు కురిసి సుభిక్షంగా ఉంటుంది. ధాన్యాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. పాల ఉత్పత్తులు అధికంగా ఉంటాయి.

 

 

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download