Yearly moonsign horoscope
18th March, 2018 to 05th April, 2019
Aries
మేషం
ఆదాయం–2, వ్యయం–14, రాజపూజ్యం–5, అవమానం–7
వీరికి అక్టోబర్ వరకు గురుబలం విశేషం. అలాగే, శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు.
ఇక అర్ధాష్టమ రాహువు వచ్చే మార్చి వరకు దోషకారి.ఈ రీత్యా పరిశీలించగా, వీరికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో విశేషంగా పేరుప్రతిష్ఠలు సాధిస్తారు.
కార్యక్రమాలు పూర్తి చేసి విజేతలుగా నిలుస్తారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదాలు క్రమేపీ పరిష్కారమవుతాయి. కొన్ని కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. బంధువర్గం నుంచి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఇంటి నిర్మాణాలను చేపడతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. రాజకీయనేతలకు మధ్యమధ్యలో అవాంతరాలు, ఇబ్బందులు నెలకొన్నా మొత్తం మీద అనుకూలమైన కాలమే. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఊహించని అవకాశాలు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, ప్రమోషన్లు ఉంటాయి. క్రీడాకారులకు మొదట్లో గడ్డుగా ఉన్నా మధ్యకాలంలో ఎదురుండదు. ఎవరెన్ని సలహాలు ఇచ్చినా సొంత ఆలోచనలతో ముందడుగు వేయడం మంచిది.
ఇక అక్టోబర్ 11 నుంచి అష్టమ గురుడు, మార్చి వరకు అర్థాష్టమ రాహువుల ప్రభావం వల్ల ధనవ్యయం. మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే, వాహనాలు నడిపే వారు కూడా అప్రమత్తంగా మెలగాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఏడాది ప్రారంభం, చివరిలోనూ అనుకూలత ఉంటుంది. వీరు గురు, రాహువులకు పరిహారాలు చేయించుకోవాలి.
అదృష్ట సంఖ్య–9