మార్గశిరం, పుష్యమాసాలు హేమంత ఋతువు, అంటే మంచుకురవడం, చలి గాలులు వీచడం ఈ మాసాల ప్రత్యేకత, ఈ మాసాలలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశికి వచ్చేవరకూ ఉండే ముప్ఫైరోజులను ధనుర్మాసం అంటారు. ఈ మాసమంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం. అటువంటి ఈ నెలరోజులు తెల్లవారు ఝామునే లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని, ఆయన అవతారమైన శ్రీ కృష్ణుణ్ణి పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ద్వాపర యుగంలో కృష్ణుని అనుగ్రహం పొందటానికి గోపికలు యమునా నదీ తీరానికి వెళ్ళి ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారుచేసి కాత్యాయనీ దేవిని ఆహ్వానిస్తూ వ్రతం చేసే వారు.అలాగే చిన్నతనం నుంచీ విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తూ ఉండే గోదాదేవి కూడా ఈ నెలంతా ధనుర్మాసం వ్రతం జరిపి శ్రీహరి అనుగ్రహం పొందింది. అందుకని విష్ణుభక్తులంతా ఈ నెల రోజులు పండగ జరుపుతారు.
ఈ మాసము లో శ్రీ మహా విష్ణువు యొక్క ప్రీతి కొరకు చేసే పూజాది కార్యక్రమములు అక్షయ ఫలితాలను కలిగిస్తుంది. సూర్యోదయానికి ముందే శ్రీమహావిష్ణువు ని తులసి తో పూజించి, పెసలు తో చేసిన పొంగలిని ని స్వామి కి నివేదిస్తే సకల దోషాలు పోతాయి అని ప్రతీతి. సూర్యుడు ధనూరాశి లో ఉన్నప్పుడు ఉష: కాలం లో శ్రీ మహావిష్ణువు ని ఒక్క రోజు బ్రహ్మీ ముహూర్తం లో పూజించినా వెయ్యి సంవత్సారాల పూజ ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ మాసం లో చేసే నదీ స్నానం,సముద్ర స్నానం అశ్వమేధ యాగం తో సమానమైనది పురాణాల ఆధారం గా తెలుస్తుంది. ఈ మాసం లో చేసే పూజలు, దానధర్మాలు వెయ్యిరెట్ల ఫలితాన్నిస్తాయి.
గోదాదేవి శ్రీ రంగనాధుణ్ణి కీర్తిస్తూ పాడిన పాశురాలే "తిరుప్పావై" గా నేటికీ వైష్ణవులు గానం చేస్తారు. తిరు అంటే మంగళకరమైన అని పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది. ధనుర్మాసం అంతా తెల్లవారు ఝామునే లేవడం, ముగ్గులు పెట్టడం గొబ్బెమ్మలను పెట్టడం, కీర్తనలు పాడుతూ,తంబూర వాయిస్తూ వీధుల్లో సంచరించే హరిదాసుల సందడి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వివాహం ఆలస్యమవుతున్న అమ్మాయిలు ఈ మాసం లో కాత్యాయని దేవిని/దుర్గా దేవిని పూజించడం వలన శీఘ్రంగా వివాహ యోగం కలుగుతుంది. ధనుర్మాసం లో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు లభిస్తాయి.