ఆది శంకరాచార్య వైభవం
భారత దేశం లో అనేక కొత్త మతాలూ సిద్ధాంతాలు పుట్టుకొచ్చి ప్రజలకు సనాతన ధర్మం పట్ల భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయం లో మన సనాతన ధర్మ పరిరక్షణ కై అవతరించిన అపర శంకరావతారమె ఆది శంకరాచార్యులు. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆది శంకరులు జన్మించారు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి.
ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి , శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంత కాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.
ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ , ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసాన దశలో శ్రీకృష్ణభగవానుని లీలలను చూపించి సంతోష పరచాడు
ఆయన కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో కుమారిలభట్టు , మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు , పద్మపాదుడు , సురేశ్వరుడు , పృధ్వీవరుడు మొదలైన వారు.
హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన , ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ , అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు , ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు.
ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ , అనేక , ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి , శివానందలహరి , భజగోవిందం మొదలైనవి.
గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం , కనకథారా స్తోత్రం , శివానందలహరి , సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.
శృంగేరి, బదరి, పూరీ, ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం , దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం , పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం , ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ , ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.
అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.