ఉగాది కృత్యం 2023

ఉగాది కృత్యం 2023

ఉగాది కృత్యం

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోవడం తెలుగు ప్రజల ఆనవాయితీ.

తెలుగు వారు చాంద్రమానం పాటిస్తుండగా, తమిళులు సౌరమానం పాటిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు.

పంచాంగ శ్రవణం ద్వారా ఆ ఏడాది దేశ కాలమాన పరిస్థితులు,  జాతక విశేషాలు తెలుసుకుని బంధుమిత్రులతో ఆనందంగా గడపడం,

కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉగాది రోజున పాటిస్తారు.

చాంద్రమాన ప్రకారం ఈ సంవత్సరాన్ని శ్రీశోభకృత్‌నామ సంవత్సరంగా పిలుస్తారు. ప్రభవాది 60 సంవత్సరాల్లో 37వది శ్రీశోభకృత్‌నామ సంవత్సరం. అధిపతి రవి. సూర్యభగవానుని పూజించిన తేజస్సు, ఆరోగ్యం కలుగుతాయి. అలాగే శోభకృత్‌నామ సంవత్సరాధిపతి శుక్రుడు. ఈ శుక్రుని ఆరాధించిన సుఖసంపదలు, తేజస్సు, కీర్తి దక్కుతాయి.

పుష్కర నిర్ణయం

–––––––––––––

శ్రీ శోభకృత్‌నామ సంవత్సర వైశాఖ శుక్ల విదియ, శుక్రవారం అనగా 21.04.23వ తేదీ తెల్లవారుజామున గం.5.16ని.లకు తెల్లవారితే శనివారం దేవ గురువు బృహస్పతి మిత్ర స్థానమైన మేషరాశిలో ప్రవేశంతో గంగానదీ పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇవి 12రోజుల పాటు జరుగుతాయి. ఈ కాలంలో దానధర్మాలు, స్నానాదులు పుణ్యఫలాన్నిస్తాయి.

గ్రహణాలు

 

ఈ ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి అనగా 28.10.23వ తేదీ శనివారం రాత్రి 1.05 గంటలకు రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది అశ్వని నక్షత్రంలో వస్తున్నందున ఈ నక్షత్రం వారితో పాటు, మేష రాశి వారు చూడరాదు. వీరు తగు పరిహారాలు పాటించాలి. గ్రహణ మోక్షకాలం గం.2.23 ని.లకు.

–––––––––––––––––––––––––––––––––––––––––

మకర సంక్రాంతి

శ్రీ శోభకృత్‌నామ సంవత్సర పుష్య శుక్ల చవితి సోమవారం, అనగా 15.01.24వ తేదీ ఉదయం గం.8.26 ని.లకు రవి మకరరాశి ప్రవేశం. ఇదే రోజు మకర సంక్రాంతి పండగ.

మూఢములు

గురు మూఢమి: చైత్ర శుక్ల అష్టమి బుధవారం అనగా 29.03.2023 వ తేదీ సా.5.01 గంటలకు గురుమూఢమి ప్రారంభం.

వైశాఖ శుక్ల షష్ఠి మంగళవారం అనగా 25.04.23వ తేదీ మూఢమి ముగుస్తుంది.

శుక్ర మూఢమి: అధిక శ్రావణ బహుళ అష్టమి మంగళవారం, అనగా 08.08.23వ తేదీ ప.1.59 గంటలకు శుక్రమూఢమి ప్రారంభం.

నిజశ్రావణ శుక్ల తదియ, శుక్రవారం, అనగా 18.08.23వ తేదీ రా.7.20 గంటలకు మూఢమి ముగుస్తుంది.

(ఈ కాలాల్లో సాధారణ కార్యక్రమాలు మినహా వివాహాది శుభ ముహూర్తాలు ఉండవు.)

అధిక మాసం

–––––––

ఈ ఏడాది శ్రావణ మాసం అధికమాసమైంది. అధిక మాసంలో శుభకార్యాలు ఉండవు, నిజ శ్రావణ మాసంలోనే  శుభముహూర్తాలు ఉంటాయి. (జూలై 18వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకూ అధిక శ్రావణం, 17.08.23 నుండి సెప్టెంబర్‌వ తేదీ వరకూ నిజ శ్రావణమాసం)

కర్తరీ నిర్ణయం.

––––––––

వైశాఖ పౌర్ణమి శుక్రవారం అనగా 05.05.23న డొల్లు కర్తరి ప్రారంభం.

వైశాఖ బహుళ షష్ఠి గురువారం అనగా 11.05.23వ తేదీ తెల్లవారు జామున 4.12 గంటలకు(తెల్లవారితే శుక్రవారం) నిజకర్తరి(అగ్ని) ప్రారంభం.

జ్యేష్ఠ శుక్ల దశమి సోమవారం, అనగా మే 29వ తేదీ ప.1.22 గంటలకు కర్తరి త్యాగమగును. ఈకాలంలో ఇళ్ల నిర్మాణాలు వంటివి చేయరాదు.

 

శ్రీ శోభకృత్‌నామ సంవత్సర ఫలితాలు..

ఈ సంవత్సరం రాజు బుధుడు,

మంత్రి, మేఘాధిపతి శుక్రుడు,

సేనాధిపతి, ఆర్ఘ్యాధిపతి  గురువు,

పూర్వ సస్యాధిపతి చంద్రుడు,

దాన్యాధిపతి శని,

రసాధిపతి బుధుడు

నీరసాధిపతి చంద్రుడు అయ్యారు.

రాజు, మంత్రితో సహా అధిక గ్రహాలు శుభులే కావడంతో పరిపాలన సాఫీగా సాగిపోతుంది.

దేశంలో కొన్ని వివాదాలు పరిష్కారమై ప్రజల మధ్య సయోధ్య ఏర్పడుతుంది.

ఆర్థికంగా మరింత బలం పుంజుకుంటుంది.

అలాగే, పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగి ధరలు అందుబాటులో ఉంటాయి.

ఇక బంగారం, వెండి సహా కొన్ని లోహాల ధరలు మరింత పెరుగుతాయి.

పచ్చని ధాన్యాలు విశేషంగా పండుతాయి. అపరాల ధరలు కూడా అందుబాటులోకి వస్తాయి.

అయితే వంటనూనెలు, చమురు ధరలు మాత్రం పెరిగే సూచనలున్నాయి. 

ఇక పశుపాలకుడు బలరాముడు, పశు సంరక్షకుడు శ్రీకృష్ణుడు కావున పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.

పాడి పరిశ్రమ విశేష ప్రగతి కలిగి ఉంటుంది.

పాల ఉత్పత్తులు అధికంగా ఉంటాయి.

ఇక వర్షాలు కూడా సమతూకంగా కురుస్తాయి.  

ఇక వర్షలగ్నం వృశ్చికం, జగల్లగ్నం కన్య అయినది.

ఈ లగ్నాలకు కేంద్ర కోణములందు శుభగ్రహాలు, శుభదృష్టి కలిగి ఉండడం వల్ల సుభిక్షం, ధన, ధాన్య వృద్ధి ఉంటుంది.

పశ్చిమ ప్రాంతంలో కొంతకాలం దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. తూర్పు ప్రాంతంలో సమతూకంగా పరిస్థితులు ఉంటాయి.

ఇక దక్షిణ దేశమందు పాలకులు మారడం,

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహాయసహకారాలు నామమాత్రంగా ఉంటాయి.

కొన్ని ప్రాంతాల్లో ఊహించని ఖనిజసంపదలు వెలుగులోకి వస్తాయి. అలాగే, ఇరుగుపొరుగు దేశాలలో శాంతిసామరస్యాలకు మన పాలకులు విశేష కృషి చేస్తారు.

శాస్త్రసాంకేతిక రంగాలలో మన దేశం మరింత అభివృద్ధి సాధించే దిశగా సాగిపోతుంది.

కొన్ని ప్రాంతాలలో ప్రజలకు వివిధ వ్యాధులు సోకి అలజడిగా ఉంటుంది.

గురుడు మేషరాశి సంచారం వల్ల దేశానికి, ప్రజలకు మరింత మేలు కలుగుతుంది.

అలాగే, శని కుంభరాశి సంచారం వల్ల అన్ని విధాలా మేలు చేకూరుతుంది.

నవనాయకుల్లో అధికంగా శుభులే కావడం విశేషం.

రాజకీయ వైషమ్యాలు,ప్రజాసమస్యలు తగ్గి అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తాయి.

భూకంపాలు, తుపానులు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తాయి.

వ్యాపారాలు, వాణిజ్యరంగాల వారికి ధరలు తగ్గినా లాభాలకు లోటు రాదు.

వ్యవసాయదారులు పంటలపై పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి.  రాజకీయవర్గాలలో పరస్పర వివాదాలు, పార్టీల మార్పు వంటివి ఉంటాయి.

కార్తీక, మార్గశిర మాసాలలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు రావచ్చు.

కళా రంగం వారు విశేషమైన కీర్తిప్రతిష్టలు పొందుతారు.

సాఫ్ట్‌వేర్, రియల్‌ఎస్టేట్‌ రంగాలు పూర్వ వైభవం పొందుతాయి.

వైద్య, సేవారంగాల వారికి విశేష కీర్తి దక్కుతుంది.

సరికొత్త పరిశోధనలతో శాస్త్రవేత్తలు ఇతర దేశాలతో పోటీపడతారు.

సాధారణ వృత్తుల వారికి సైతం ఇబ్బందులు తొలగుతాయి.

శ్రావణం, భాద్రపద మాసాలలో మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి రావచ్చు.

దీనివల్ల కొందరికి పదవీవియోగం కలిగే సూచనలున్నాయి.

అలాగే, ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో రైలు, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలున్నాయి.

మొత్తం మీద ఈ సంవత్సరం శుభఫలితాలే అధికంగా ఉంటాయి. ప్రజలు సుభిక్షంగా జీవించే పరిస్థితులు ఏర్పడవచ్చు.

నవనాయక ఫలాలు..

–––––––––––

1.రాజు బుధుడు కావడం వల్ల అపరాల సాగు పెరుగుతుంది. వీటి ఉత్పత్తులు పెరిగి ధరలు అందుబాటులో ఉంటాయి. శిల్పకారులకు వృద్ధి ఉంటుంది. గాలులతో కూడిన తుపాన్లు సంభవించవచ్చు. వ్యాధులు కూడా కొన్ని వ్యాపించే వీలుంది.

2.మంత్రి శుక్రుడు కావడం వల్ల గోసంరక్షణ జరిగి పాల ఉత్పత్తులు పెరుగుతాయి. పంటలకు కొంత నష్టం కలుగవచ్చు. ధరలు మాత్రం తగ్గుదల కనిపిస్తుంది.

3.సేనాధిపతి గురువు కావడం వల్ల ప్రజాభీష్టానికి పాలకులు పెద్దపీట వేస్తారు. గ్రామాలు పాడిపంటలు, అభివృద్ధితో విలసిల్లతాయి.  వర్షాలకు లోటు లేకుండా కురుస్తాయి.

4.ఆర్ఘ్యాధిపతి గురువు కావడం వల్ల ధరలు మరింత తగ్గి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు. ధనధాన్య వృద్ధి. దైవకార్యాలు విరివిగా జరుగుతాయి.

5.మేఘాధిపతి శుక్రుడు కావడం వల్ల ప్రజలు ఆరోగ్యవంతులై జీవిస్తారు. పంటలకు నష్టం లేకుండా ఉత్పత్తులు లభిస్తాయి.  వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.

6.పూర్వసస్యాధిపతి చంద్రుడు కావడం వల్ల మాగాణి, మెట్ట పంటలు బాగా పండుతాయి. గోధుమలు, జొన్నలు, సజ్జలు, చెరకు,చింతపండు వంట  వస్తువుల ధరలు అందుబాటులోకి వస్తాయి.

7.అపరసస్యాధిపతి(ధాన్యాధిపతి) కావడం వల్ల నువ్వులు, మినుములు, ఆవాలు సమృద్ధిగా పండుతాయి. వీటికి తగిన మార్కెట్‌కూడా లభిస్తుంది.

8.రసాధిపతి బుధుడు కావడం వల్ల మిరియాలు, ఇంగువ, ఉల్లిపాయలు, నెయ్యి, అల్లం,  నూనెలు, బెల్లం, పంచదార, వేరుసెనగ, కొబ్బరి ధరలు పెరుగుతాయి.

9.నీరసాధిపతి చంద్రుడు కావడం వల్ల ముత్యాలు, వెండి, కంచు తదితర లోహాలు, వస్త్రాలు, అలంకార వస్తువుల ధరలలో కొంత మార్పు కనిపిస్తుంది. ఇవి ప్రజలకు అందుబాటు ధరలలోకి వస్తాయి.

 

 

 

 

 

 

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download