శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు

శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు

 

శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు...

 

ప్రభవాది 60 సంవత్సరాలలో 39వది విశ్వావసు నామ సంవత్సరం.

ఏడాది ధాన్య దానం విశేష ఫలితాలనిస్తుంది.

సంవత్సరాధిపతి రాహువు.

రాహువు దోషపరిహారం కోసం దుర్గామాతను, అలాగే, సర్పాన్ని (నాగదేవత)ను పూజించాలి.

ఇక సంవత్సరానికి రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి రవి,

మంత్రి చంద్రుడు.

పూర్వసస్యాధిపతి గురువు,

అపర సస్యాధిపతి కుజుడు,

రసాధిపతి శని,

నీరసాధిపతి బుధుడు.

 

నవనాయకుల్లో ఆరుగురు పాపులు, ముగ్గురు శుభులు.

 

మూఢములు...జ్యేష్ట పౌర్ణమి, మంగళవారం, అనగా 10.06.25 నుండి ఆషాఢ శు.త్రయోదశి మంగళవారం అనగా, 08.07.25 వరకు గురు మూఢమి.

అలాగే, మార్గశిర శు.దశమి ఆదివారం అనగా 30.11.25 నుండి మాఘ బహుళ ఏకాదశి, శుక్రవారం అనగా 13.02.26 వరకు శుక్ర మూఢమి.

 

పుష్కరాలు... ఏడాది 15.05.25 తేదీ వైశాఖ శు.తదియ,గురువారం నుండి 26.05.2025 తేదీ సోమవారం వరకు సరస్వతీ నదీ పుష్కరాలు.

 

గ్రహణములు...

ఏడాది మన దేశంలో కనిపించే సూర్య గ్రహణాలు లేవు. ఇక 07.09.25 తేదీ భాద్రపద పౌర్ణమి, ఆదివారం రాత్రి 9.50 గంటల నుండి 1.31 గంటల వరకు సంపూర్ణ చంద్ర గ్రహణం. ఇది శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాలలో ఏర్పడుతుంది. అందువల్ల కుంభరాశి వారు చూడరాదు.

 

అలాగే, 03.03.26 తేదీ ఫాల్గుణ పౌర్ణమి, మంగళవారం రాత్రి 3.21 నుండి 6.47(తెల్లవారితే బుధవారం) వరకు పాక్షిక చంద్ర గ్రహణం. ఇది పుబ్బ నక్షత్రంలో ఏర్పడుతుంది. సింహరాశి వారు చూడరాదు. అయితే గ్రహణం బహు స్వల్పంగా కనిపిస్తుంది.

 

రాజు రవి, మంత్రి చంద్రుడు మిత్రులు కావడం వల్ల పాలకుల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుంది.

ప్రభుత్వాలు చేసే పనులు పారదర్శకంగా ఉండి అందరి మన్ననలు పొందుతాయి.

ఆర్థిక రంగం బలం పుంజుకుని అభివృద్ధి దిశగా దేశం పయనిస్తుంది.

ఇతర దేశాల్లో అలజడులు మనకు కొంత ఇబ్బంది కలిగించినా పటిష్టమైన విధానాల వల్ల ప్రజల పై ప్రభావం కనిపించదు.

అయితే దేశం లోపల, బయట కొన్ని శక్తులు అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు సాగిస్తారు.

మన రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొని సైనికచర్యకు సైతం సిద్ధపడాల్సి ఉంటుంది.

నూతన ఆయుధ సంపత్తి సమకూరుతుంది

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష ప్రగతి సాధించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడతారు.

ముఖ్యంగా ఆయిల్, పప్పుధాన్యాలు, బంగారం, వెండి, ఇనుము ధరలు పెరుగుతాయి.

ఎర్రటి నేలల్లోని పంటలు విరివిగా పండుతాయి.

ధాన్యం దిగుబడులు పెరిగి రైతులకు ఉత్సాహంగా ఉంటుంది. గిట్టుబాటు కూడా లభిస్తుంది.

నువ్వులు, మినుములు, నూనెగింజల ఉత్పత్తులు కూడా ఆశాజనకంగా ఉంటాయి.

 

ఇక ఈశాన్యప్రాంతంలోనూ, దక్షిణాదిన వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో మధ్యస్థంగా కురుస్తాయి. ఇక పంచ గ్రహకూటమి, చాతుర్గ్రహ  కూటమి వల్ల యుద్ధభయాలు, ప్రకృతి బీభత్సాలు, కొన్నిచోట్ల సముద్రంలో భూకంపాలు సంవభవించవచ్చు.

విమాన, రైలు ప్రమాదాలు కూడా సంభవిస్తాయి.

తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి సమతూకంగా ఉంటుంది.

సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పాలకులు చర్యలు తీసుకోవడంతో ప్రజలు ఊరట చెందుతారు.

షేర్ల మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి.

-------------------------------------------

విశ్వావసు నామ సంవత్సరంలో అశాంతి....అలజడులు....

--------------------------------

రానున్న ఉగాది నుండి ప్రారంభమయ్యే తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సరంలో కొన్ని గ్రహాల స్థితిగతులు అలజడులకు, విచిత్ర రోగాలకు, సర్వత్రా ఆందోళనలకు దారితీస్తాయి.

 

ఉగాది నుండి రెండురోజులు(మార్చి 29,30 తేదీలు) మీన రాశిలో షష్ఠగ్రహ కూటమి(రవి, బుధ, శని, శుక్ర, చంద్ర, రాహువులు ఆరుగ్రహాల కలయిక) ఏర్పడనుంది.

ఇది అత్యంత ఇబ్బందికరం. దీనివల్ల నాయకులకు, ప్రజలకు కష్టకాలం. కొన్ని ప్రమాదాలు, హఠాత్తుగా భూకంపాది ప్రమాదాలు, ఊహించని వ్యాధుల వ్యాప్తి సంభవించవచ్చు.

 

మూడు రోజులు క్రమం తప్పకుండా శివ దర్శనం చేయడం సర్వత్రా ఉత్తమం.

Mar 31 వ తేదీ నుండి 13వరకు 13రోజుల పాటు మీనరాశిలోనే పంచగ్రహ కూటమి(రవి, బుధ, శుక్ర, శని, రాహువుల కలయిక) ఏర్పడనుంది. దీనివల్ల దుర్భిక్ష పరిస్థితులు, కొన్ని దేశాలలో వ్యాధుల వ్యాప్తి, జననష్టం, ప్రకృతి బీభత్సాలు వంటివి నెలకొంటాయి.

 

సంవత్సరారంభం నుండి మే నెల 6 తేదీ వరకూ మీనరాశిలో చాతుర్గ్రహ( బుధ, శుక్ర, శని, రాహు గ్రహాలు మీనరాశిలో) కూటమి వల్ల విశేష సూర్యతాపం, అకాల మరణాలు, యుద్ధభయాలు, ధరల పెరుగుదల వంటి ఫలితాలు చూడాల్సిన పరిస్థితి.

 

ఇక జూన్7 తేదీ నుండి జులై 28 తేదీ వరకూ కుజరాహువుల పరస్పర వీక్షణాల వల్ల (సింహంలో కుజ, కుంభంలో శని సమసప్తక స్థితి) యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు, కొన్ని వ్యాధులు వ్యాపించే సూచనలు.

 

ఉగాది నుండి సుమారు మూడు నెలల పాటు అపసవ్యరీతిన కాల సర్పదోష ప్రభావం(మీనంలో రాహువు, కన్యలో కేతువు మధ్యలో గ్రహాలన్నీ అపసవ్యంగా ఉండడం) కారణంగా వివిధ సమస్యలు, రోగాలతో ప్రజలు అవస్థ పడతారు. కొందరు జాతీయ, అంతర్జాతీయ నేతల పై ఆరోపణలు, అరెస్టులు, ఆందోళనకు రేకెత్తవచ్చు.

 

ఇక డిసెంబర్ 29 నుండి 2026 జనవరి 12 మధ్యకాలంలో తిరిగి చాతుర్గ్రహ కూటమి (రవి, బుధ, కుజ, శుక్రులు ధనుస్సు రాశిలో కలయిక) వల్ల ప్రకృతి వైపరీత్యాలు, ధరల భారం, కొన్నిచోట్ల కరవు పరిస్థితులతో కల్లోలంగా మారే అవకాశం.

 

అలాగే, జనవరి 17 నుండి ఫిబ్రవరి 2 తేదీ మధ్య తిరిగి చాతుర్గ్రహ కూటమి(రవి, బుధ, కుజ, శుక్రులు మకరంలో కలయిక) వల్ల విమాన, జలప్రమాదాలు, భూకంపాది భయాలు ఉంటాయి.

 

కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలకు ముప్పు, నేతలకు గండాలు ఉంటాయి. ఇదే ఫలితాలు సర్వవ్యాప్తంగా ఉంటాయి. ప్రజలు ఆయా కాలాలలో దైవభక్తి కలిగి, తగిన పరిహారాలు జరుపుంటూ ఉండడం శ్రేయస్కరం.

 

------------------------

 నవనాయక ఫలాలు...

 

రాజు-రవి....పాలకుల మధ్య పరస్పర వివాదాలు,అల్పవృష్ఠి,అగ్నిబాధలు, అస్త్రశస్త్రాల వలన భయం, కొన్ని దేశాలలో అధికారాల మార్పిడులు, రాజకీయాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. అలాగే, గోధుమలు, ధాన్యం, కలప, మిర్చి, కందులు, వేరుసెనగ, కొబ్బరి, పగడాలు, కెంపులు, నూలు వస్త్రాల ధరలు పెరుగుతాయి.

 

మంత్రి-చంద్రుడు....పాలకులు, ప్రజల మధ్య అవగాహన పెరిగి పరిపాలన సాఫీగా సాగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు ఉంటాయి. అన్ని ప్రాంతాల్లోనూ సమవృష్ఠి, ఆహారధాన్యాల కొరత తీరుతుంది. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. పాడి పరిశ్రమ స్వయంసమృద్ధి సాధిస్తుంది. కిరోసిన్, పెట్రోల్ ధరలలో తగ్గుదల, వెన్న, నెయ్యి, పంచదార, వెండి, బంగారం ధరలు పెరిగి స్థిరంగా ఉంటాయి.

 

సేనాధిపతి -రవి....ఎర్రని ధాన్యాలు, ఎర్రని భూములు బాగా పండుతాయి. వివిధ దేశాల మధ్య ఆధిపత్యపోరు, పరస్పర దాడులు అనివార్యం కావచ్చు. వాయువులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

 

అర్ఘాధిపతి -రవి...వర్షాలు ఆశించినంత కాకుండా తక్కువగా ఉండవచ్చు. ధరల భారం తప్పదు. యుద్దభయాలు, బలాఢ్యులదే రాజ్యం అన్నట్లుగా ఉంటుంది. ఎర్రని ధాన్యాలు, వెండి, బంగారం ధరలు హెచ్చుగా ఉంటాయి. వేరుసెనగ, కొబ్బరినూనెలు, మిర్చి వంటి వస్తువుల ధరలలో పెరుగుదల కనిపిస్తుంది.

 

మేఘాధిపతి -రవి...ప్రజల్లో తెలియని భయాందోళనలు, యుద్థ వాతావరణం, అక్కడక్కడ భారీ వర్షాలు, పంటనష్టాలు జరుగుతాయి. ఎర్రని నేలలకు డిమాండ్ పెరుగుతుంది.

 

పూర్వసస్యాధిపతి-గురువు.... పచ్చని ధాన్యం బాగా పండుతాయి. గోధుమలు, సెనగలు, జొన్నలు, పెసలు, ఉలవల ఉత్పత్తులు పెరుగుతాయి. పత్తి, చర్మం, తగరం, రబ్బరు, వస్త్రాల ధరలలో తగ్గుదల ఉంటుంది.

 

అపరసస్యాధిపతి(ధాన్యాధిపతి)-కుజుడు....కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుసెనగ, ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి. బెల్లం, పంచదార, నెయ్యి, నూనెగింజల ధరలు పెరుగుతాయి.

 

రసాధిపతి-శని....నువ్వులు, మినుములు, ఉలవల వంటి నల్లని పంటలు, రేగడి భూములు బాగుగా పండుతాయి.

 

నీరసాధిపతి-బుధుడు...అద్దక పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. సుగంధ ద్రవ్యాలు, మంచిగంధం, వస్త్రాల ధరలు కొంతమేర తగ్గి నిలకడగా కొనసాగుతాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download