తొలిఏకాదశి ప్రాముఖ్యత
కర్మ భూమిగా ప్రసిద్ది పొందిన భారతదేశం లో, కర్మలు ఆచరించడానికి అనువైన పండుగలను తిథుల ప్రకారంగా కూడా నిర్ణయించారు. వీటి లో ముఖ్యమైనది ఏకాదశీ తిథి. ప్రతి నెలలో వచ్చే ఏకాదశులు రెండూ విశిష్ఠమైన పర్వదినాలే. ఆషాడ శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేక శయనైకాదశి అంటారు. ఈనాటి నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు. ఈ వ్రత దీక్షా కాలంలో వచ్చే ఏకాదశుల్లో ఆషాడ శుద్ద ఏకాదశే మొదటిది కావడం చేత, ఇప్పటి నుంచి ఒకదాని తరవాత మరొకటిగా వచ్చే పండుగల పర్వానికి ఇదే నాంది కనుక ఈ పండుగను తొలి ఏకాదశి గా వ్యవహరిస్తారు. నేటి నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషపాన్పు పై శయనించి, కార్తిక శుద్ద ఏకాదశినాడు మేల్కొంటాడని పురాణ ప్రసక్తి. అందుకే దీన్ని శయనైకాదశి అని కూడా అంటారు.
ఏకాదశి వ్రతాన్ని శైవ, వైష్ణవ, సౌరది మతస్థులందరూ విష్ణు ప్రీతి కోసం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు దశమి నుంచే సాధనలో కొనసాగుతారు. దశమి నాడు ఒక్కపూటే భుజించి, నియమాలను పాటిస్తూ మనస్సును సదా దైవ స్మరణలోనే ఉంచాలి. తద్వారా ఏకాదశి నాడు చేసే వ్రతాచరణకు దేహేంద్రియ మనో బుద్దులు చక్కగా సహకరిస్తాయంటారు.
ఏకాదశి నాడు ఆచరించే వ్రతంలో ఉపవాసం ఒక ముఖ్య భాగం. తులసి తీర్థం తప్ప మరేమీ తీసుకోకూడదు. వ్రత దీక్షాపరులు దైవ చింతనలోనే కొనసాగాలి. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించరాదు. ద్వాదశి నాడు ఉదయమే నిత్య పూజలు చేసి శ్రీ మహా విష్ణువు ని , అజ్ఞానమనే అంధకారం చేత అంధుడనైన నాకు వ్రత ఫలం గా జ్ఞాన దృష్టిని అనుగ్రహించు అనే ప్రార్ధనా పూర్వకమైన మంత్రాన్ని పఠించాలని ధర్మసింధు చెబుతోంది. ఇలా నియమాలను పాటిస్తూ, ఉపవాస దీక్షతో, ఇంద్రియ నిగ్రహం తో, శ్రద్దా భక్తులతో ఆచరించే ఏకాదశీ వ్రతంవల్ల విష్ణు సాయుజ్యం, ఇహ లోకం లో సకల సంపదలు ప్రాప్తిస్తాయని ధర్మసింధు తెలయజేబుతుంది.