కాలభైరవాష్టమి విశిష్ఠత
మార్గశిర బహుళ అష్టమి నాడు కాలభైరవ స్వరూపం ఆవిర్భవించిన రోజని పురాణాల ఆధారం గా తెలుస్తుంది. ఒకసారి పరమ శివునికి బ్రహ్మకు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. బ్రహ్మ చతుర్ముఖాల లో మధ్యమ ముఖం పరమేశ్వరుని దూషించింది. ఆగ్రహం తో శివుడు కాలభైరవుడిని సృష్టించాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మ తల నరికాడు. దీని మూలం గా కాల భైరవునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకొంది. బ్రహ్మ హత్య దోషం నివారణకై కాశీ చేరుకొన్న కాలభైరవుడు అక్కడే నిలిచి పోయి కాశీ క్షేత్రపాలకుడయ్యాడు. పురాణాల ఆధారం గా భైరవులు ఎనిమిది మంది గా చెప్పబడింది.
కాల భైరవుడు కాల స్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. ఈయన వాహనం శునకం. భైరవుడంటే పోషకుడు, భయంకరుడని అర్ధం. కాలభైరవుణ్ణి పూజిస్తే మృత్యు భయం తొలగిపోతుంది. పవిత్రమైన కాలభైరవాష్టమి రోజున గంగా స్నానం, పితృ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే అన్ని బాధల నుండి ఉపశమనం పొందుతారు. ఈ రోజున కాలభైరవుని కొరకు అతి ముఖ్యం గా ఆచరించే విధులలో గారెల మాల వేయడం, కొబ్బరి మరియు బెల్లం నివేదించడం చేస్తారు, ఇలా చేయడం వలన ఆయుర్దాయం పెరుగుతుందని ప్రతీతి.
నిర్మలమైన భక్తి భావం తో కాలభైరవుణ్ణి పూజిస్తే సమస్త పాపాలు , గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు , అకాల వ్యాధులు తొలగుతాయి. దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది. రాహు గ్రహ సంబంధిత సమస్యలు, శని బాధలు, తీవ్రమైన కష్టనష్టాలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కాలభైరవాష్టకం చదివి భైరవుణ్ణి పూజిస్తే అరిష్టాలు తొలగి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఎటువంటి పరిస్థితుల లోను అబద్దాలు చెప్పకూడదు. సత్యవ్రతులను కాల భైరవుడు అనుగ్రహిస్తాడు. అసత్యవాదులను కాలభైరవుడు దండిస్తాడు.