నవనాయక ఫలాలు.
రాజు – శని - రాజు శనీశ్వరుడు కావడం వల్ల ప్రజలు చోరాగ్ని బాధలు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. పంటలకు కొంత నష్టం, ప్రభుత్వ చట్టాలు అర్థం కాక ప్రజలు అయోమయానికి లోనవుతారు. మోసకారితనం అధికమవుతుంది. అయితే తక్కువ కాలం పండే పంటలు ఫలిస్తాయి.
మంత్రి – గురువు - దేవగురువు మంత్రి కావడం వల్ల దేశం సుభిక్షంగా, పాడిపంటలతో విలసిల్లుతుంది. పాలన సవ్యమార్గంలో నడుస్తుంది. అధికారగణంతో ప్రభుత్వాలకు సమన్వయం పెరుగుతుంది.
సేనాధిపతి – బుధుడు - వాయువులతో కూడిన వర్షాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రజాసౌఖ్యం. పంటలు సంపూర్ణంగా పండుతాయి. అయితే సైనిక హడావుడి అధికంగా ఉంటుంది.
అర్ఘ్యాధిపతి – బుధుడు - వర్షాలు అధికంగా ఉంటాయి. అలాగే, వివిధ వస్తువుల ధరలు పెరుగుతాయి. పుప్పుదినుసులు, ఎరువుల ధరల పెరుగుదల ఇబ్బందికరంగా మారవచ్చు.
మేఘాధిపతి – బుధుడు - మధ్యభారతంలో వర్షాలు అధికంగా ఉంటాయి. అలాగే, తూర్పుతీరంలో తుఫాన్లు, గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
పూర్వసస్యాధిపతి – రవి - సూర్యుడు సస్యాధిపతి కావడం వల్ల యవలు, గోధుమలు, ఉలవలు, సెనగ పంటలు అధికంగా పండుతాయి. రైతులకు సరైన గిట్టుబాటు ధరలు కూడా లభిస్తాయి.
అపర సస్యాధిపతి – శుక్రుడు - ప్రజలు ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అన్ని పంటల ఉత్పత్తులు అనుకూలిస్తాయి. అతివృష్టి పరిస్థితులు నెలకొన్నా సుభిక్షంగానే ఉంటుంది.
రసాధిపతి – కుజుడు - రసద్రవ్యములకు కుజుడు అధిపతి కావడం వల్ల నెయ్యి, నూనెలు, బెల్లం,వెండి, ఉప్పు వంటి వస్తువుల ధరలు తగ్గుతాయి.
నీరసాధిపతి – శని - వివిధ లోహాలతో చేసిన వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అయితే బంగారం, రత్నాలు, వెండి, ముత్యాలు వంటి ధరలు అధికం కావడంతో ప్రజలు ఇబ్బందిపడతారు. ఇనుము, నూనెల ఉత్పత్తులు అధికమవుతాయి.