తొలి ఏకాదశి ప్రాముఖ్యత
ఆషాడ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశగా ప్రయాణించడం వల్ల దక్షిణాయనం గా పరిగణిస్తారు. ఈనాటి నుంచే చాతుర్మాస్య వ్రతాన్ని ఆరంభిస్తారు. ఈ వ్రత దీక్షా కాలంలో వచ్చే ఏకాదశుల్లో ఆషాడ శుద్ద ఏకాదశే మొదటిది కావడం చేత, ఇప్పటి నుంచి ఒకదాని తరవాత మరొకటిగా వచ్చే పండుగల పర్వానికి ఇదే నాంది కనుక ఈ పండుగను తొలి ఏకాదశి గా వ్యవహరిస్తారు. నేటి నుంచి నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషపాన్పు పై శయనించి, కార్తీక శుద్ద ఏకాదశినాడు మేల్కొంటాడని పురాణ ప్రసక్తి. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు.
ఏకాదశి వ్రతాన్ని శైవ, వైష్ణవ, సౌరది మతస్థులందరూ విష్ణు ప్రీతి కోసం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు దశమి నుంచే సాధనలో కొనసాగుతారు. దశమి నాడు ఒక్కపూటే భుజించి, నియమాలను పాటిస్తూ నాలుగు నెలల పాటు బెల్లం, తైలం , విడిచిపెట్టాలి. కాల్చి వండిన ఆహారం, గుమ్మడి కాయ, చెఱుకు, కొత్త ఉసిరిగా, పుచ్చకాయ, చింతపండు తేనే, పొట్లకాయ, ఉలవలు, మినుములు వాడకపోవడం మంచిది. నిత్యం దైవ స్మరణ చేస్తుంటే దేహేంద్రియ మనో బుద్దులు చక్కగా సహకరిస్తాయి.
ఏకాదశి నాడు ఆచరించే వ్రతంలో ఉపవాసం ఒక ముఖ్య భాగం. తులసి తీర్థం తప్ప మరేమీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు ఉదయమే నిత్య పూజలు చేసి శ్రీ మహా విష్ణువు ని పూజించి ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించరాదు. ఇలా నియమాలను పాటిస్తూ, ఉపవాస దీక్షతో, ఇంద్రియ నిగ్రహం తో, శ్రద్దా భక్తులతో ఆచరించే ఏకాదశీ వ్రతం వల్ల విష్ణు సాయుజ్యం, ఇహ లోకం లో సకల సంపదలు ప్రాప్తిస్తాయని ధర్మసింధు తెలయజేబుతుంది.
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, గోవుని పూజించడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. ఈరోజు ముఖ్యం గా పేలాలు పిండి ని స్వామి వారికి నివేదించి, అందరికి ప్రసాదం గా పంచుతారు. పేలాల పిండి పితృ దేవతలకు కూడా ఇష్టమైనది గా చెప్తారు. ఈ విధం గా పితృ దేవతలని కూడా స్మరించుకోవడం జరుగుతుంది.
ఇందులోని చక్కటి ఆరోగ్యం సూత్రం గమనించినట్లైతే, వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. కావున ఈరోజు అందరు పేలాల పిండిని తినాలని పెద్దలు చెప్తారు.