మేషం
ఆదాయం–8, వ్యయం–14. రాజపూజ్యం–4, అవమానం–3.
వీరికి మే 1వ తేదీ నుండి గురు బలం విశేషం.
అలాగే, శని, కేతువులు కూడా అనుకూలురు.
ఇక రాహువు మాత్రం వ్యయ స్థానంలో పాపి.
ఈరీత్యా చూస్తే వీరికి మే నుండి అన్ని విధాలా అనుకూల సమయం.
ఆదాయవ్యయాలలో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆర్థికంగా ఎప్పుడూ లేనంతగా బలపడతారు.
ఇతరుల నుండి రావలసిన సొమ్ములు అనూహ్యంగానే వస్తాయి.
ఇంత కాలం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు పటాపంచలై ఊరట చెందుతారు.
జీవిత గమ్యాన్ని సరైన దిశగా నడిపించే విధంగా ఒకరు మార్గదర్శనం చేస్తారు.
మనోబలం పెరిగి బుద్ధికుశలతతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు.
ఎప్పటికప్పుడు ఆర్థిక, మనోబలాన్ని అంచనా వేసుకుంటూ ముందడుగు వేస్తారు.
మీ నిజాయితీ, సన్మార్గ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు.
అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది.
అలాగే భార్యాపుత్రుల ద్వారా ఆనందదాయంగా గడుస్తుంది.
మీలోని నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చే సమయం.
ఆస్తులు లేదా ఇళ్లు కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి.
విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు దక్కుతాయి.
అలాగే, స్థిరమైన ఆలోచనలతో సాగుతారు.
వ్యాపారస్తులు గతం కంటే మెరుగైన లాభాలను గడిస్తారు.
భాగస్వాములతో తగాదాలు తీరతాయి.
ఉద్యోగస్తుల విధుల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.
ఊహించని బదిలీలు, కొందరికి పదోన్నతులు రావచ్చు.
రాజకీయవేత్తలు కొన్ని కొత్త పదవులు పొందుతారు.
కళాకారులు మునుపటి కంటే అధికంగా అవకాశాలు దక్కించుకుంటారు.
వీరికి ప్రభుత్వం నుండి పుర స్కారాలు రావచ్చు.
శాస్త్రసాంకేతిక వర్గాలకు విశేష గుర్తింపు, ప్రశంసలు దక్కవచ్చు.
నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అద్భుత అవకాశం లభిస్తుంది.
వ్యవసాయదారులు రెండుపంటలు లాభించి ఉత్సాహంగా గడుపుతారు.
రాహు ప్రభావం వల్ల తరచూ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు.
అలాగే, శత్రుబాధలు ఉండవచ్చు.
కార్తీకం, మార్గశిర మాసాలు మినహా మిగతా నెలలన్నీ సానుకూలమే.
వీరు దుర్గామాతకు అర్చనలు, స్తోత్రాలు పఠిస్తే మంచిది.