సింహం
ఆదాయం–2, వ్యయం–14, రాజపూజ్యం–2, అవమానం–2.
వీరికి గురువు దశమ స్థానంలో సంచారం గోచారరీత్యా ప్రతికూలమైనప్పటికీ మూర్తిమంతంచేత శుభదాయకుడు.
సప్తమ శని, అష్టమ రాహువు, ద్వితీయ కేతువులు దోషకారులే.
మొత్తానికి వీరికి ద్వితీయార్థంలో గురు ప్రభావం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
ఆర్థికంగా కొంత కూడబెట్టినా ఏదో ఖర్చు ఎదురవుతునే ఉంటుంది.
పొదుపు చేయాలన్న కోరిక ఫలించదు.
నమ్మినవారే మిమ్మల్ని వంచించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎవరి విషయాలలోనూ జోక్యం చేసుకోకుండా మీ జీవనం సాగించడం ఉత్తమం.
కుటుంబంలో కొన్ని సమస్యలు నెలకొని అగ్నిపరీక్షగా మారవచ్చు.
అయితే గురుడు కొంత యోగాన్నిస్తాడు . కొన్ని ఇబ్బందుల నుండి గట్టెక్కే ఉపాయం తడుతుంది.
ఇక ఆస్తులు కొనుగోలుకు ఎంతోకాలంగా చేస్తున్న యత్నాలు కలిసివస్తాయి.
రాహు ప్రభావం వల్ల ఆరోగ్యం ముఖ్యంగా నరాలు, ఎముకలు, చర్మ సంబంధింత వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు.
పెద్ద వైద్యులను సంప్రదిస్తారు.
నేర్పు,సహనం, పట్టుదలే మీకు ప్రధానాస్త్రాలుగా ఉపయోగపడతాయి.
కొన్ని కష్టాలు ఎదురయ్యే సమయానికి ఆపద్బాంధువుడిలా ఒకరు సాయం అందిస్తారు.
ఎవరేమన్నా మౌనమే సమాధానం కావాలి.తొందరపాటు వద్దు.
వ్యాపారస్తులు కొంతమేర లాభాలు గడించినా అవి పెట్టుబడులకే సరిపోతాయి.
ఉద్యోగస్తులకు విధి నిర్వహణ మొదట్లో కష్టమైనప్పటికీ క్రమేపీ దూసుకుపోతారు. ఇంక్రిమెంట్లు విషయంలో ఇబ్బందులు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులకు కొన్ని వ్యవహారాలు ఎట్టకేలకు సానుకూలమవుతాయి.
కళాకారులు కొన్ని అవకాశాలను పెండింగ్‌లో పెడతారు.
విద్యార్థులు మరింత కష్టపడితే అనుకున్నది సా«ధిస్తారు.
వ్యవసాయదారులు రెండవ పంటను పుష్కలంగా పొందుతారు.
మహిళలు ఆత్మవిశ్వాసం పెంచుకుని ముందడుగు వేయడం మంచిది.
ఆశావాదంతో ముందుకు సాగుతారు.
చైత్రం, వైశాఖ మాసాలు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిగతావి సామాన్యంగా ఉంటాయి.
వీరు గురు, శని, రాహు,కేతువులకు పరిహారాలు చేయాలి.
శ్రీ నృసింహ స్తోత్రాలు పఠనం ఉపయుక్తంగా ఉంటుంది.