మీనం
ఆదాయం –11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–4.
వీరికి గురువు మే 1 నుండి తృతీయ రాశిలో సంచారం, శని వ్యయస్థితి, జన్మరాహువు, సప్తమంలో కేతువు సంచారం నామమాత్రంగా ఉంటుంది.
వీరు అన్నింటా తగు జాగ్రత్తలు పాటిస్తూ దైవాన్ని స్మరిస్తూ ముందుకు సాగడం మంచిది.
ఆర్థిక విషయాలు గందరగోళంగా మారి అవసరాలకు కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది.
ఇతరుల వ్యవహారాలలో జోక్యం ద్వారా మాటపడతారు.
ఎవరినీ అతిగా విశ్వసించకుండా మీ ఆలోచనల మేరకు అడుగులు వేయడం మంచిది.
ఆరోగ్యం పై తగు జాగ్రత్తలు పాటిస్తూ , ఎప్పటికప్పుడు వైద్య సలహాలు స్వీకరిస్తూ ఉండాలి.
కుటుంబంలో మీ మాటంటే అంతగా పట్టించుకోని వైనం.
ఏ వ్యవహారం చేపట్టాలన్నా ధైర్యం చాలక వెనుకడుగు వేస్తారు.
జన్మరాహువు కారణంగా శత్రుబాధలు, మానసిక ఒత్తిడులు పెరుగుతాయి.
భార్యాపుత్రులతోనూ వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకునే విధంగా యత్నిస్తారు.
అయితే ఆత్మవిశ్వాసం పెంచుకుని పట్టుదల, నేర్పుగా సాగితే కొన్ని సమస్యలు అధిగమిస్తారు.
ఇంటి నిర్మాణాలను మధ్యలో నిలిపివేసే అవకాశం.
సోదరీసోదరులతో సత్సంబంధాలు దెబ్బతినకుండా తగు విధంగా నడుచుకోవడం మంచిది.
విద్యార్థులు ఎంత కష్టించినా ఫలితం కొంత నిరాశ కలిగిస్తుంది.
వ్యాపారస్తులు గతం కంటే లాభాలు తగ్గి ఆందోళన చెందుతారు.
ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల బెదిరింపులు, పనిలో భారం సవాలుగా మారవచ్చు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులు సహనంతో ఉంటే కొంత అనుకూలత పొందుతారు.
కళాకారులు అందివచ్చిన అవకాశాలు సైతం వదులుకుంటారు. అలాగే, కొన్ని అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు.
వ్యవసాయదారులకు పంటలు సాధారణ స్థాయిలో ఉంటాయి. పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు.
మహిళలు మానసిక ఆందోళనతో గడుపుతారు.
చైత్రం, ఆశ్వయుజం, పుష్యమాసాలు సామాన్యంగా, మిగతావి మిశ్రమంగా ఉంటాయి.
వీరు నిత్యం ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించడం మంచిది.